అలనాటి నాయికలలో, ప్రథమ స్థానంలో నిలబడే అర్హత ఒక్క సావిత్రి గారికి ఉంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు అని సాహసించి చెప్పగలను. తన నటనా చాతుర్యంతో దక్షిణ భారత మరియు హిందీ చిత్రసీమలను శాసించిన నటనా శిరోమణి ఆమె. తొలి అవకాశం, అగ్నిపరీక్ష అనే చిత్రంలో వచ్చినా, ఆ పాత్రకు చిన్న పిల్లలా ఉందని, వచ్చిన అవకాశం పోయింది. తరువాత, 1950 లో సాధన చిత్రం వారి "సంసారం" లో 2nd హీరోయిన్గా అవకాశం వచ్చినా, నాగేశ్వర రావు ముందు డయలాగు చెప్పడానికి బయపడితే, ఆ పాత్రకు పుష్పలతను పెట్టుకొని, సావిత్రికి చిన్న వేషం ఇచ్చారట. ఈ చిత్రం విడుదల తరువాత, ఆమె లోని ప్రతిభను గుర్తించి, 1951 లో పల్లెటూరు, సాహుకారు చిత్రాలలో అవకాశం వచ్చింది. కానీ 1952 లో వచ్చిన "పెళ్లి చేసి చూడు"లో రెండవ హీరోయిన్ గా వేసిన తరువాత, ఇంక మళ్లీ వెనుక తిరిగి చూడ లేదు. ముఖ కవళికలకు, కళ్ళతోనే భావాలూ తెలియ పరచడంలో, ఆమెకు ఆమే సాటి. అందుకే ఆమె మహానటి అయ్యింది. ఆమె నటించిన "చదువుకున్న అమ్మాయిలు" చిత్రంలోని ఈ పాటలో ఆమె హావభావాలు చూడండి, పాటను విని ఆనందించండి.